Friday, May 30, 2008

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః !"


చల్లని నదీమతల్లి గోదావరి లా సాగిపోయింది ఈ సంవత్సరం 'మెమోరియల్ డే వీక్ ఎండ్'. చికాగో మహానగరం దగ్గర లెమోంట్ లో శ్రీ రామాలయంలో శని, ఆది, సోమ వారాలలో జరిగిన 'శ్రీ త్యాగరాజ స్వామి ' వారి కర్నాటిక సంగీతోత్సవాన్ని సందర్శించే అవకాశం కలిగింది. వీనులకు విందైన చక్కటి శాస్త్రీయ సంగీతం, పంటికి పసందైన ఇంట వండిన భోజనం, ఇవి వారు మాకు అందించినవి. ఇంక ఇంతకు మించి ఏకావాలండీ?

ప్రముఖ విద్వాంసులు శ్రీ టి.ఎం.క్రిష్ణ, శ్రీ.మహారాజపురం, శ్రీ గుండేచా సోదరుల హిందుస్తానీ భజనలబాణీ, శ్రీమతి.అరుణా సాయిరాం, శ్రీమతి.ఎం.ఎస్.షీలా లు అందించిన
అలౌకిక ఆనందం ఒక ఎత్తు
ఆయితే , ఇక చికాగో నగర ప్రాంతాలలో మన శాస్త్రీయ కర్ణాటక సాంప్రదాయాన్ని నిలబెట్టటానికి అహర్నిశలు పరిశ్రమించిన పిల్లలు,వారి తల్లిదండ్రులు, నేర్పించిన గురువులు వారందరి కృషి మరోక ఎత్తు.

ఇటు ప్రముఖ విద్వాంసులని ఆదరిస్తూ, అటు చిన్నపిల్లల ప్రతిభని మనకందరుకూ తెలిసేలా చాటిచెప్పిన ఈ కార్యక్రమ నిర్వాహకుల సంగతి ఏం చెప్పమంటారు?

"నభూతో నభవిష్యతి!" అనవచ్చు కానీ పరిస్తితి అదికాదు, వారి ఉత్సాహం, కృషి చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇంకా,ఇంకా బాగా చేస్తారన్నది ఖాయం.
ఇంత మంచి అనుభవం హృదయాన్నీ,దేహాన్నీ కూడా అలరిస్తాయన్నది అతిశయోక్తి కాదు. శాస్త్రీయ సంగీత జ్ణానంలేని నేనే ఇలాటి అనుభవాన్ని పొందితే, ఇక ప్రాజ్ణుల సంగతి చెప్పాలా!!
మనదేశంలో పాశ్చాత్య వరవడి ఎక్కువై "స రి గ మ " అంటే నే తెలియదనే ఈ ఆధునిక యుగంలో, అమెరికాలో పుట్టి, పెరిగి, మన సంగీతంలో సాధన చేసి, అందరినీ మెప్పించిన ఆ పిల్లలు, వారిని కన్నవారు కూడా నిజంగా ధన్యులు.
ఇది ఎవరైన చూసి దీనిగురించిన వివరాలు కావాలనుకుంటే కనుక, ఈ క్రింద లింకు నొక్కండి. http://tyagaraja-chicago.org/WordPress/

No comments: