Monday, June 2, 2008

నర్తకి

నా ఆనంద పారవశ్యం నటనం
నా జీవన పరమావధి నాట్యం
నటరాజే నా ఆరాధ్య దైవం
నటనమే నా ఆరాధనం

నృత్య గీతానికి తొలి చరణాన్ని
నటరాజ పాద కళా మంజీరాన్ని
నాట్య యజ్ఞానికి సుమనోజ్ఞ సమిధను
భావ రాగా తాళాలకు ప్రాణాన్ని

కంచు తాళాల గంభీర ధ్వనిలో
మంద్ర మృదంగ లయలో
రసః హృదయ రాగాలాపనలో

తరంగితాంతరంగనై - శబ్ద తరంగాన్నై
లయనై - కింకిణీ శబ్ద లయనై
ఆలాపననై - రాగాలాపననై
రాధనై - నాట్య కళారాధనై

మేళవించాను, ముగ్ధనయ్యాను
సంగమించాను, స్వరాన్నయ్యాను

నేను నర్తకిని
రక్తిమ నిండిన రాగాను నర్తకిని
పల్లవి నా ప్రాణం, రాగం నాగానం
గగన తలాన్ని చుంబించే
విన్యాసం
నా హృదయం


హిమవన్నగ జాత గిరిజ నటరాజును వీడదు
గంగా తరంగ ఝరులలో తడిసిన
ప్రమోదకాల నాట్య మంజరి
వెండి
కొండను వీడదు









No comments: