Tuesday, June 8, 2010

Contact Me

Tuesday, November 17, 2009

శ్రీ రామ దర్శనం



 


శ్రీ రఘువీరుడు కోదండ రాముడు సీతమ్మతో నాకు దర్శనమిచ్చాడు
మాయమ్మ తో కలసి నను బ్రోవ తలచాడు .......శ్రీ రఘువీరుడు ....


పుణ్య శబరీ తల్లి అతిధి గా నా స్వామి 
కన్నులంతా తానై నిండి పోయాడు 
దివ్యాంశ సంభూత పోతల దమ్మక్కకు 
కోరి కనిపించి తనకు వాసమడిగిన స్వామి...శ్రీ రఘువీరుడు.....


తల్లి సీతమ్మ కాలి పారాణి దిద్దుతూ..
సిరి సిరి నగవుల నొలికించు నా స్వామి
రామనామమే సతతం చిలుకలు పలుకంగా
మైమరిచి జానకి సమేతుడై నా స్వామి ...శ్రీ రఘువీరుడు......

Wednesday, October 28, 2009

"కార్తీక దీపం"



"ఆరనీకుమా దీపం కార్తీక దీపం!"




కార్తీక మాస ప్రాశస్త్యం
కార్తీక మాసం హిందూ నెలలలో ఎనిమదవ మాసం మరియు, ఎంతో పవిత్రమైన కార్యాలకు, ఆధ్యాత్మిక కార్యాక్రమాలకు అనువైన మాసం. ఈ
మాసం పరమశివునికి, మహా విష్ణువుకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసమని హిందువుల విశ్వాసం ఈ కార్తీక మాసంలో ఎన్నో ముఖ్యమైన పండుగరోజులు వస్తాయి.
 
కార్తీక మాస గాధ:
పద్మ పురాణంలోని ఉత్తరకాండలో ఈ
కార్తీక మాసం యొక్క విశేషత తెలియజేయబడింది. దిలీప చక్రవర్తి ఇహలోక భంధవిముక్తుడై, ఉత్తమలోకాలను చేరుకున్న విధం లాంటి ఎన్నో గాధలు కార్తీక మాస వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ వశిష్ట మహాముని చేవివరించబడ్డాయి. ఒకానొక సమయంలో సత్యభామ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి వివరించమని కోరింది. కృత యుగములోశంఖాసురుడు' (సోమకుడు) అనే రాక్షసుడు వేదములను అపహరించి, సముద్రములో దాక్కున్నాడని, ఆ అసురుని చంపి, వేదములను ఉద్దరించటానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి 'శంఖాసురుని' లేక 'సోమకాసురుని' అంతమొందించి వేదములనుకాపాడెనని శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు.
శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడే మత్స్యావతారమెత్తి వేదములను పునరుద్ధరించాడనిహిందువుల విశ్వాసం.

కార్తీక మాసంలో చేయబడే పూజా కార్యక్రమాలని కార్తీక మాస వ్రతం గా చెబుతారు. ఈ కార్తీక మాస వ్రతానికి కొన్ని నిర్దుష్టమైన నియమాలు వున్నాయి. కార్తీక పురాణం ఈ నియమాలను, పద్ధతులను గురించి వివరంగా తెలియ చెబుతుంది. ఎన్నో హిందూ గ్రంధాలు కుడా ఈ వ్రత నియమాలను వివరిస్తున్నాయి.
 

కార్తీక మాస వ్రత నియమాలు:
* కార్తీక మాసమంతా కూ
డా మాంసాహారము ముట్టరాదు. మాంసాహారము తినటం బ్రహ్మహత్యా పాతకముతో సమానము.
*
కార్తీక మాసమంతయు భక్తుల ఒకే పుట భోజనం చేస్తారు. ఒక పుట పాలు, పళ్ళు తినవచ్చును. అలా చేయలేకపోయినా, పర్వదినాలైన కార్తీక సోమవారాలు, కార్తీక ఏకాదశి, కార్తీక పూర్ణిమలోనైనా ఏక భుక్తలై వుండాలి. అనగా ఒకేసారి భోజనం చేయాలి.
*
ప్రతి రోజు అభ్యంగ స్నానం చేయాలి.
*
ప్రతి సాయంత్రం పూజ చేసి వీధి గుమ్మంలో దీపం పెట్టాలి
*
కార్తీక పురాణం మాసం లో చదవటం విశేష ఫలాలను కలిగిస్తుంది. కనీసం ఒక అధ్యాయం ప్రతిరోజూ చదివినా, నాలుగు పుణ్యక్షేత్రాలు (చార్ ధాం) వెళ్ళిన ఫలితం కలుగునని జనుల విశ్వాసము.

సోమవార వ్రతం:
'
సోమేశ్వరుడు' అని శివునికి మరో పేరు. 'సోమ' అంటే 'చంద్రుడు'. చంద్రుని తల పై వుంచుకున్నాడు కనుక సోమేశ్వరుడైనాడు.కనుక 'సోమేశ్వరుని' కటాక్షాన్నికోరుతూ, కార్తీక సోమవారాలు ఉపవవాసం చేస్తారు. ఉపవాసం అంటే కేవలం లంఖణం చేయటం కాదు. 'ఉప' అంటే దగ్గరగా 'వాసం' అంటే ఉండటం. ఎవరికీ దగ్గరగా వుండాలి? భగవంతుడికి దగ్గరగా వుండటం 'ఉపవాసం'.తిండి మానేశాము కనుక దాని మీదే దృష్టి పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగం లేదు. ఎక్కువ తినడం వలన జాడ్యం కలుగుతుంది. అదే కాస్త తేలికగా వుంటే కాస్త మనసు, బుద్ధి, అప్రమత్తతగా వుంటాయి.

తులసి వివాహం:
కార్తీక మాసం లో ఇంకొక ముఖ్యమైన రోజు 'క్షీరాభ్ధి ద్వాదశి' లేక 'చిలుకు ద్వాదశి. ఇది పౌర్ణమి కి ముందు వచ్చే ద్వాదశి అనగా పన్నెండవ రోజు. పర్వదినాన 'తులసి' కి 'శ్రీ మహావిష్ణువు'కి వివాహ మహోత్సవం! ఈరోజు తులసి కోటలో రాసి వుసిరి కొమ్మని పెట్టి వివాహం జరిపిస్తారు. రాసి వుసిరి 'శ్రీ మహావిష్ణు' గా భావించి వివాహ మంత్రాలు చదువుతారు. శ్రీ మహా విష్ణువు నాలుగు నెలలు యోగనిద్రలో వున్నా సమయంలో చాతుర్మాస వ్రతం పాటిస్తారు. ఆషాడ శుక్ల ఏకాదశి లేక శయన ఏకాదశి నాడు చాతుర్మాస దీక్షమొదలై ఉత్థాన ఏకాదశి నాడు అనగా శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర సమాప్తితో దీక్ష కూడా సమాప్తి అవుతుంది. క్షీర సాగర మధన సమయంలో క్షీర సాగారమునుండీ 'తులసి' ఉధవించి, శ్రీ మహావిష్ణు ను వివాహ 
మాడినది అని తులసి వివాహం క్షీరాభ్ధి ద్వాదశి నాడు చేస్తారు.
  
క్షీరాబ్ధి ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి మేలుకుని బృందావనానికి మహాలక్ష్మి, బ్రహ్మ సమేతంగా వచ్చాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. ఈనాడే దేవతలకీ, అసురులకి మధ్య క్షీర సాగర మధనం సాగినదన్న కధ కుడా వాడుకలో వున్నది. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో క్షీరాభ్ది ద్వాదశి చాలా ప్రాసస్త్యమైన రోజు.

******************************************
క్షీరాభ్ది శయనా నారాయణా..శ్రీలక్ష్మి రమణా నారాయణా..
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నతజన పరిపాల నారాయణా ...
వైకుంఠ వాసా నారాయణా.. వైదేహి మోహన నారాయణా
నారాయణా హరి నారాయణా.. నారాయణా శ్రీమన్నారాయణా
నరహరి రూపా నారాయణా..
*********************************************

అని వీనుల విందుగా, హృదయానందం తో పాడుకుంటూ...కార్తీక మాసంలో... 'కాళేశ్వర, కరిరాజవరదుల' కటాక్ష వీక్షణాలకై  భక్తి శ్రద్ధలతో, ఆర్తిగా ప్రార్థిద్దాము. అరిషడ్వర్గాలైన 'కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యా' లను సాధ్యమైనంత కళ్ళాలతో బిగించి, మన జీవన రధాలని సన్మార్గంలో నడిపించమని మనస్పూర్తిగా ప్రార్ధిద్దాము.

Tuesday, October 27, 2009

ఏమి వ్రాయాలి???

ఏమిటో సరదాగా మళ్ళీ ఏదైనా వ్రాద్దామా అనిపించింది! బ్లాగ్ పెట్టి ఇన్నాళ్ళు అయ్యింది, కుదురుగా కూర్చుని ఒక్కనాడైనా సరిగ్గాఏమీ చేయలేదనిపించింది. ఏదైనా చేసేముందుగా నాకు ఏమి చేయాలో తెలియాలిగా! బహుశా అది తెలియకనే నేమో అవస్థఅంతా!
పూర్తిగా తెలుగులోనే బ్లాగ్ నడపాలా! లేక పూర్తిగా ఇంగ్లిష్ లో నడపాలా! అన్నది ఒక సందిగ్ధం. కాదులెండి, ఇంతబ్రతుకు బ్రతికి, ఇంటివెనకాల చచ్చినట్లు! ఇంగ్లిష్ లో నడిపే ప్రశక్తే లేదు. పోతే, పూర్తిగా తెలుగులో నడపాలంటే, పాఠకులకు అర్థం కావటం సంగతిఅటుంచి, నాకే అంత భాషా పటుత్వం గానీ, జ్ఞానం గానీ లేవన్నది సత్యం! కనుక బ్లాగ్ తప్పక 'తెంగ్లిష్' బ్లాగ్ గా వుంటుంది. హమ్మయ్య, భాష సంగతి తెల్చేసాను. ఇక పోతే ఏమి వ్రాయాలి అన్నది మరొక సమస్య! బాగా ఆలోచించాకా అనిపించినదేమిటంటే! అమెరికా దేశాల సంగతి ఎలావున్నా, మనదేశంలోనే పిల్లలకి మన సంస్కృతీ, సంప్రదాయాలు తెలియటం కష్టంగా వున్నట్టుగా నాకు మధ్య చాలా అనిపిస్తోంది. అలా అనిపించటం కేవలం నా భ్రమ మాత్రమే కాదని నా ఇండియా ప్రయాణాలు రుజువు చేసాయి. అందుకే కొన్ని ప్రస్థావాలు పిల్లలకి  ఏవిధంగా మానవతా విలువలు ఆచరణంలో అర్థం అయ్యేలా చెప్పాలి అన్నవి కుడా దీనిలోపెట్టాలని ఆలోచన గాఢంగా వున్నది. చూద్దాం దైవ సంకల్పం ఎలా వుంటుందో!

Monday, October 26, 2009

భామనే సత్య భామనే !



భామనే.. సత్యా ..భామనే! వయ్యారి ముద్దుల..
సత్య భామనే ..సత్యా భామనే..

భామనే పదియారువేలా కోమలులందరిలోనా
రామరో గోపాలదేవుని ప్రేమనుదోచినా ||సత్య||

అట్టహాసము చేసి సురల అట్టేగేలిచిన పారిజాతపు
చెట్టుతేచ్చి నాదు పెరటా గట్టిగా నాటించు కున్నా..||సత్య||

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే..
జాణతనమున సతులలో నెరజాణనై..వెలిగేటి ||సత్య||

అందమున ఆనందమున గోవిందునకు నెరవిన్దునే
నందనన్దనుదేన్డుగానక ..నందనన్దనుదేన్డుగానక..
డెందమందున కుములుచుండే ||భామనే||

కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోనా
లలనా.. చెలియా.. మగువా.. సఖియా..
గోపాల దేవుని బాసి తాళజాలక యున్నట్టి..||భామనే||

Monday, June 2, 2008

నర్తకి

నా ఆనంద పారవశ్యం నటనం
నా జీవన పరమావధి నాట్యం
నటరాజే నా ఆరాధ్య దైవం
నటనమే నా ఆరాధనం

నృత్య గీతానికి తొలి చరణాన్ని
నటరాజ పాద కళా మంజీరాన్ని
నాట్య యజ్ఞానికి సుమనోజ్ఞ సమిధను
భావ రాగా తాళాలకు ప్రాణాన్ని

కంచు తాళాల గంభీర ధ్వనిలో
మంద్ర మృదంగ లయలో
రసః హృదయ రాగాలాపనలో

తరంగితాంతరంగనై - శబ్ద తరంగాన్నై
లయనై - కింకిణీ శబ్ద లయనై
ఆలాపననై - రాగాలాపననై
రాధనై - నాట్య కళారాధనై

మేళవించాను, ముగ్ధనయ్యాను
సంగమించాను, స్వరాన్నయ్యాను

నేను నర్తకిని
రక్తిమ నిండిన రాగాను నర్తకిని
పల్లవి నా ప్రాణం, రాగం నాగానం
గగన తలాన్ని చుంబించే
విన్యాసం
నా హృదయం


హిమవన్నగ జాత గిరిజ నటరాజును వీడదు
గంగా తరంగ ఝరులలో తడిసిన
ప్రమోదకాల నాట్య మంజరి
వెండి
కొండను వీడదు









Friday, May 30, 2008

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః !"


చల్లని నదీమతల్లి గోదావరి లా సాగిపోయింది ఈ సంవత్సరం 'మెమోరియల్ డే వీక్ ఎండ్'. చికాగో మహానగరం దగ్గర లెమోంట్ లో శ్రీ రామాలయంలో శని, ఆది, సోమ వారాలలో జరిగిన 'శ్రీ త్యాగరాజ స్వామి ' వారి కర్నాటిక సంగీతోత్సవాన్ని సందర్శించే అవకాశం కలిగింది. వీనులకు విందైన చక్కటి శాస్త్రీయ సంగీతం, పంటికి పసందైన ఇంట వండిన భోజనం, ఇవి వారు మాకు అందించినవి. ఇంక ఇంతకు మించి ఏకావాలండీ?

ప్రముఖ విద్వాంసులు శ్రీ టి.ఎం.క్రిష్ణ, శ్రీ.మహారాజపురం, శ్రీ గుండేచా సోదరుల హిందుస్తానీ భజనలబాణీ, శ్రీమతి.అరుణా సాయిరాం, శ్రీమతి.ఎం.ఎస్.షీలా లు అందించిన
అలౌకిక ఆనందం ఒక ఎత్తు
ఆయితే , ఇక చికాగో నగర ప్రాంతాలలో మన శాస్త్రీయ కర్ణాటక సాంప్రదాయాన్ని నిలబెట్టటానికి అహర్నిశలు పరిశ్రమించిన పిల్లలు,వారి తల్లిదండ్రులు, నేర్పించిన గురువులు వారందరి కృషి మరోక ఎత్తు.

ఇటు ప్రముఖ విద్వాంసులని ఆదరిస్తూ, అటు చిన్నపిల్లల ప్రతిభని మనకందరుకూ తెలిసేలా చాటిచెప్పిన ఈ కార్యక్రమ నిర్వాహకుల సంగతి ఏం చెప్పమంటారు?

"నభూతో నభవిష్యతి!" అనవచ్చు కానీ పరిస్తితి అదికాదు, వారి ఉత్సాహం, కృషి చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇంకా,ఇంకా బాగా చేస్తారన్నది ఖాయం.
ఇంత మంచి అనుభవం హృదయాన్నీ,దేహాన్నీ కూడా అలరిస్తాయన్నది అతిశయోక్తి కాదు. శాస్త్రీయ సంగీత జ్ణానంలేని నేనే ఇలాటి అనుభవాన్ని పొందితే, ఇక ప్రాజ్ణుల సంగతి చెప్పాలా!!
మనదేశంలో పాశ్చాత్య వరవడి ఎక్కువై "స రి గ మ " అంటే నే తెలియదనే ఈ ఆధునిక యుగంలో, అమెరికాలో పుట్టి, పెరిగి, మన సంగీతంలో సాధన చేసి, అందరినీ మెప్పించిన ఆ పిల్లలు, వారిని కన్నవారు కూడా నిజంగా ధన్యులు.
ఇది ఎవరైన చూసి దీనిగురించిన వివరాలు కావాలనుకుంటే కనుక, ఈ క్రింద లింకు నొక్కండి. http://tyagaraja-chicago.org/WordPress/